ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (21:09 IST)

భక్తి పారవశ్యంలో తొక్కను స్వామి నోటికి అందించాడు... అప్పుడేమైంది?

సాధారణంగా మనం ప్రతిరోజు దేవునికి పూజ చేస్తూ ఉంటాం. దేవుడిని అందంగా అలంకరించుకొని ఆనందిస్తూ ఉంటాం. దేవుని కొరకు రకరకాల పదార్ధాలు తయారుచేసి నివేదిస్తూ ఉంటాం. కాని దేవుడు నన్ను కరుణించలేదు. నాపై దేవునికి దయ కలుగలేదు అని బాధ పడుతూ ఉంటాం. ఇలా చేసిన పూజల వలన ప్రయోజనం ఉండదు. చిత్తశుద్ధి లేని పూజ, దైవ భక్తి లేని ప్రసాదం అంటే దేవునికి కూడా ఇష్టం ఉండదు. మన మనస్సు అనే పూవును భక్తితో సమర్పించినపుడు మాత్రమే ఉత్తమ ఫలితం లభిస్తుంది. అది ఎలాగో చూద్దాం.
 
పూర్వం ఒక గ్రామంలో విష్ణుభక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా భగవంతుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయంతో స్తోత్రాలు చేసాడు. స్వామికి ఏదైనా నివేదించాలి అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా ఒక అరటిపండు కన్పించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలచి పండు పడవేసి భక్తి పారవశ్యంలో తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్తవత్సలుడు అయిన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్థానమయ్యాడు. తర్వాత తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేసాను అని కుమిలిపోయాడు.
 
మళ్లీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి ప్రతి రోజూ ఒక డజను అరటి పండ్లు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు... దాంతో భక్తుడు బాధతో... తండ్రి అపరాధి అయిన ఈ భక్తుడుని కరుణించి దర్శనం ఇవ్వమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి మరలా ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటిపండ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటును గుర్తుకు తెచ్చుకుని తొక్క పడవేసి పండు స్వామికి అందించాడు. కాని విష్ణుమూర్తి పండు తినటానికి ఇష్టపడలేదు. ఎంత బతిమాలిన ఫలితం లేదు. 
 
భక్తుడు ఆవేదనతో... నా భక్తిలో ఏదైనా లోపం వుందా స్వామి గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా ఇప్పుడు ఇలా కినుక వహించారు ఏమిటి అని ప్రశ్నంచాడు. విష్ణుమూర్తి చిన్నగా నవ్వి... నాయనా ఇంతకుముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి తొక్క నివేదించినందున స్వీకరించాను. ఇప్పుడు నీ మనస్సు అరటిపండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా భక్తిరసహీనం కావడం వలన అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను అని సమాధానం ఇచ్చాడు. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయ్యింది. భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువా అనుకొని నిండు మనస్సుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.