శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:27 IST)

ఉజ్జయినిలో కాలభైరవునికి మద్యమే నైవేద్యం..

ఆధ్యాత్మికతను బోధించి, మనస్సుకు నిర్మలత్వాన్ని కలిగించేవి ఆలయాలు. సకల జనులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి తన కోర్కెలు నెరవేర్చుకుంటారు. తమను ఎల్లవేళలా రక్షించమని వేడుకుంటారు. కానీ భారతదేశంలో కొన్ని వింత ఆలయాలు ఉన్నాయి. అక్కడ పాటించే ఆచారాలు మనకు భయభ్రాంతులను కలిగిస్తాయి. ఎందుకు వెళ్లామా అనే భావనను కలుగజేస్తాయి. 
 
అలాంటి కొన్ని ఆలయాల గురించి తెలుసుకుందాం. శివుని అంశగా వెలసిన రౌద్రనాథుడు కాలకేయుడు. కాలభైరవుడిని యుగయుగాలుగా అమిత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. మరి ఈ కాలభైరవున్ని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు శివుడి కోసం నారికేళాలను తీసుకెళ్ళడం అనాది కాలం నుండి సంప్రదాయంగా వస్తోంది. అయితే ఉజ్జయినిలో ఉన్న కాలభైరవుని ఆలయానికి వెళ్లే భక్తులు మద్యాన్ని తీసుకువెళతారు. 
 
ఇక్కడ ఆలయంలో దేవుడికి ఆల్కహాల్‌ను నైవేద్యంగా పెడతారు. భక్తులు తెచ్చే ఆల్కహాల్‌ను నేరుగా స్వామి వారి నోట్లో పోయడం జరుగుతుంది. పోసిన ఆల్కహాల్ తక్షణం మాయమవుతుంది. చుట్టుప్రక్కల ఆల్కహాల్ దుకాణాలు విరివిగా ఉంటాయి. కర్నూలు జిల్లాలోని హోలగుండ మండలంలో దేవరగట్టు గ్రామంలో వెలసిన మాలమల్లేశ్వరస్వామి ఆలయం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. 
 
అయితే దసరా వస్తే హింసాకాండగా మారుతుంది. పెద్ద కర్రలతో ఒకరినొకరు తలలు బద్దలు కొట్టుకోవడం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వేల సంఖ్యలో అక్కడికి జనాలు వస్తారు. రక్తం ఏరులై పారుతుంది. ఈ ఆచారాన్ని అక్కడ వెయ్యి సంవత్సరాలుగా పాటిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మలజ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని దేవ్జి మహారాజ్ మందిర్‌గా అక్కడి ప్రజలు పిలుస్తారు.
 
ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు జరిగే ఉత్సవాన్ని చూసిన వారికి చలి జ్వరం రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడి భక్తులు, ఆడా మగా బేధం లేకుండా వారిలో దెయ్యం ఉన్నట్లు భావించి చేతుల్లో కర్పురాన్ని వెలిగించుకుని ఊరంతా తిరుగుతారు. ఇలా చేయడం వల్ల తమలో మరియు తమ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. మరో వింత ఆచారం కేరళలోని త్రిసూర్ జిల్లాల్లోని కుడుంగళ్లూర్ అనే ఊరిలో కాళీమాత ఆలయంలో ఉంది. 
 
ప్రతి సంవత్సరం ఏడు రోజుల పాటు ఇక్కడ భరణి ఉత్సవాలు జరుపుతారు. ఆడమగ తేడాలేకుండా అందరూ ఒంటికి కుంకుమ రాసుకుని, చేతులలో కత్తులు పట్టుకుని, రక్తం చిందేలా తమను తాము కొట్టుకుంటూ భూతులు తిట్టుకుంటూ ఊరంతా ఊరేగుతూ చివరగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని షెట్పాల్ గ్రామంలో ప్రజలు పాములను ఆరాధిస్తారు. 
 
ఇంటిపైకప్పులో నాగుల కోసం స్థలాన్ని కేటాయిస్తారు. పాములు వారిని కరవవు. గుజరాత్‌లోని వందోదర సమీపంలో అరేబియా సముద్ర తీరంలో స్థంబేశ్వర ఆలయం ఉంది. అలలు తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే అందులో ప్రవేశించాలి. మిగతా సమయాలలో అది నీటిలో మునిగి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించడానికి సాహసం చేసిన వారికి పరమేశ్వరుని ఆశిస్సులు తప్పకుండా లభిస్తాయని విశ్వాసం.