శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (19:00 IST)

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే...

గురువు ఖ్వలిదం బ్రహ్మ. ఈ సర్వమూ బ్రహ్మమే.... అని వేదాలు చెబుతున్నాయి. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైనవాడు మాత్రమే గురువు. ఈ కాలంలో అజ్ఞులైన ప్రజలందరికి స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులే కాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలు కూడా తమ రూపమేనని తెలిపినవారు శ్రీసాయి ఒక్కరేనేమో.
 
బాబా దేహంతో ఉన్న రోజుల్లో శిరిడీలో ఒకనాటి మద్యాహ్నం శ్రీమతి తార్ఖాడ్ వడ్డన చేస్తుంటే, ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఆత్రంగా తిని వెళ్లిపోయింది. నాటి సాయంత్రం మశీదులో సాయి ఆమెతో తల్లీ... నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు.
 
ఆమె ఆశ్చర్యంతో నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది... మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే... అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు... నీకెంతో మేలవుతుంది. మశీదులో కూర్చొని నేనెన్నడు అబద్దం చెప్పను అన్నారు బాబా.
 
మరొకసారి లక్ష్మీబాయిషిండే వచ్చి నమస్కరించగానే అమ్మా.... నాకెంతో ఆకలిగా ఉందన్నారు. ఆమె వెంటనే వెళ్లి రొట్టెలు, కూర చేసుకొచ్చింది. కానీ.... బాబా వాటిని ప్రక్కన ఉన్న కుక్కకి వేశారు, ఆమె చిన్నబుచ్చుకుని మీకోసమని శ్రమపడి చేసుకొచ్చాను బాబా అన్నది.... అప్పుడు బాబా... దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే... దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. 
 
నాటి నుండి రోజూ అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం సాయినాధునికి రొట్టె సమర్పించింది. అందుకే బాబా సమాధి చెందే ముందు ఆమెను అనుగ్రహించి నవవిధ భక్తులకు సంకేతంగా తొమ్మిది నాణాలు సమర్పించారు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే విషయం బాబా మనకు స్పష్టంగా తెలియజేశారు.. కాబట్టి ఏ జీవిని మనం అసహ్యించుకోగూడదు.