మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (19:44 IST)

షిర్డి సాయిబాబాను పూజించడం అంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు...

శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి. వైష్ణవులకు విఠలుడు. శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది.
 
బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా!
 
బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబాది సచ్చిదానంద స్వరూపం. నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. బాబా తత్త్వం గురించి, బాబాని సేవించే విదానం గురించి మనకు తెలియజేసినవారు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు గారు. భరద్వాజ గారు సాయిలీలామృతాన్ని రచించి మానవాళికి నిజమైన అమృతాన్ని ప్రసాదించారు. బాబా పూర్తి తత్త్వాన్ని తెలియజెప్పారు. 
 
అంతేకాకుండా ఎంతోమంది అవదూతల గురించిన గ్రంధాలు రచించారు. వాటిని పారాయణ చేయడం వల్ల ఆద్యాత్మికత వైపు ఎలా ప్రయాణం చేయాలో తెలుస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. బాబా పట్ల ప్రేమ కలుగుతుంది. అలాంటి ఈ సద్గురుమూర్తిని మనస్పూర్తిగా పూజించినవారికి ఎలాంటి కర్మలైనా తీరవలసిందే. 
 
బాబాని పూజించడం అంటే మంచి మంచి ప్రసాదాలు పెట్టడం కొబ్బరికాయలు కొట్టడం కాదు. ఎదుటి వారి మనసు బాధపెట్టకుండా ఉండటం, మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం, మనకు ఉన్నంతలోనే నిరుపేదలకు సహాయం చేయడం, బాబా శరీరంతో ఉన్నప్పుడు పలికిన అమృత వాక్కులను మనం అనుసరించడం వలన మనం బాబాకు ఎంతో ఇష్టమైన భక్తులం అవుతాము. అలా చేస్తే మన బాధ్యత అంతా ఆయనే చూసుకుంటారు. అంటే సద్గురువుకి పగ్గాలప్పగించాక చింతకు తావే ఉండదు అన్నమాట.