సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 డిశెంబరు 2018 (13:27 IST)

మిత్రమా.... ఎందుకు బాధ పడుతున్నావ్?

మిత్రమా.... ఎందుకు బాధ పడుతున్నావ్... అయిందేదో అయ్యింది పోయిందేదో పోయింది. లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావ్... పోయేటప్పుడు మూటముల్లెతో పోవాలి అనుకుంటున్నావు. అందుకే నీకీ ఆరాటం, అశాంతి. నీవు ఏమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు. నీవు ఏమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్.. నీవు ఏమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడిదే ఇచ్చావు. 
 
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా.... రేపు మరి ఒకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు.
 
కారు లేదని చింతించవద్దు- కాలు ఉన్నందుకు సంతోషించు.
కోట్లు లేవని చితించవద్దు- కూటికి ఉంది గదా సంతోషించు.
కాలిలో ముల్లు గుచ్చుకున్నదని చింతించవద్దు- కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు.
కాలం విలువైనది- రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు.
అసూయను రూపుమాపు- అహంకారాన్ని అణగద్రొక్కు.
హింసను విడనాడు- అహింసను పాటించు.
కోపాన్ని దరిచేర్చకు- ఆవేశంతో ఆలోచించకు.
ఉపకారం చేయలేకపోయినా- అపకారం తలపెట్టవద్దు.
దేవుని పూజించు- ప్రాణికోటికి సహకరించు తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు.