గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 31 మే 2017 (18:49 IST)

ఇంటికి ఈశాన్యంలో మారేడు చెట్టు వుంటే...?

పరమేశ్వరుడిని "ఏకబిల్వం శివార్పణం" అని మారేడు దళాలతో పూజిస్తారు. మూడు దళాలు కలిసి ఒకే అండమునకే ఉంటాయి. కాబట్టి, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. పవిత్రమైన ఈశ్వర పూజకు ఈ బిల్వ పత్రము సర్వశ్రేష్టమైనది, పవిత్రమైనది. శివార్చనకు మూడు రేకులతో వుండే పూర్తి

పరమేశ్వరుడిని "ఏకబిల్వం శివార్పణం" అని మారేడు దళాలతో పూజిస్తారు. మూడు దళాలు కలిసి ఒకే అండమునకే ఉంటాయి. కాబట్టి, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. పవిత్రమైన ఈశ్వర పూజకు ఈ బిల్వ పత్రము సర్వశ్రేష్టమైనది, పవిత్రమైనది. శివార్చనకు మూడు రేకులతో వుండే పూర్తి బిల్వదళమునే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వ పత్రములు, సుమారు 15 రోజులు వరకు పూజార్హత కలిగి వుండును. వాడిపోయినను దోషము లేదు. కాని మూడు రేకులు మాత్రము తప్పనిసరిగా ఉండాలి. 
 
ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అని, కుడివైపునది విష్ణువని, మధ్యనున్నది సదాశివుడని పురాణములు చెబుతున్నాయి. ఇంకా బిల్వములోని ముందు భాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుట చేత, బిల్వ పత్రము ముందు భాగమును శివుని వైపు ఉంచి పూజించాలి. 
 
బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది. మారేడు చెట్టు వున్నచోట ఆ చెట్టుకింద శివుడు ఉంటాడు. ఇంటి ఆవరణలో ఈశాన్య భాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కలుగును. తూర్పున వున్నచో సుఖప్రాప్తి, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కలుగును. దక్షిణము వైపున వున్నచో యమబాధలు వుండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 
 
శ్రో|| బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనమ్| 
అఘోర పాపసంహరం ఏకబిల్వం శివార్పణమ్ || 
 
బిల్వపత్రము యొక్క దర్శనం వల్ల పుణ్యము లభించడంతో పాటు వాటిని స్పృశించుట వలన సర్వ పాపములు నశించును. ఒక బిల్వ పత్రమును శివునికి భక్తి శ్రద్ధలతో అర్పించడం వలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతం నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల బిల్వదళమును శివునికి సమర్పించి ఆ ముక్కంటి అనుగ్రహం పొందుదాం.