విదురనీతి: ధృతరాష్ట్రా.. నీకేమో నీతిపట్టదు.. నీ కుమారులు నీతిమాలిన పనులే చేస్తారు!

Selvi| Last Updated: బుధవారం, 30 మార్చి 2016 (19:32 IST)
కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపివేసి.. తన కుమారులను రక్షించేందుకు ధృతరాష్ట్రుడు ఆరాటపడుతాడు. విదురుడు యుద్ధం ప్రారంభమయ్యేందుకు గల కారణాలను వివరిస్తూ.. ధృతరాష్ట్రునికి బుద్ధి చెప్తాడు. సంజయుని సంధికి సిద్ధం చేస్తాడు. ఆ సమయంలో విదురనీతి ఎలా ఉందంటే.. విదురా.. యుద్ధానికి సమయం వచ్చేసింది. తనను ఏం చేయమంటావని ప్రశ్నిస్తాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తాడు.

''అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూశావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏ రోగం లేక పోయినా బాధపడక తప్పదు'' అంటాడు.

ఇంకా విదురుడు ధృతరాష్ట్రునికి ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిదని హితబోధ చేస్తాడు. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు.

ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపు మాటలు నీకు తెలియనివా? చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు. ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు. ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు.

పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందువలన అందరూ సుఖపడతారు. నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు. దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోత్సహిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు. కయ్యానికి పిలిచిన వారిని వదలరు.

పాడవులు నిన్ను తండ్రి స్థానంలో ఉంచి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దుఃఖించడం మాను" అన్నాడు.దీనిపై మరింత చదవండి :