శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (16:07 IST)

బ్రహ్మోత్సవ నాయకుడికి వెచ్చనిపాలూ వెన్నముద్దలంటే?

బ్రహ్మోత్సవ నాయకుడికి వెచ్చనిపాలూ వెన్నముద్దలంటే ఇష్టం. నిత్య వరుడికి నేతి లడ్డూలంటే ప్రాణం. సుప్రభాతం నుండి నవనీత హారతి వరకూ.. ప్రతి సందర్భంలోనూ సమర్పించే నైవేద్యాల చిట్టా.. వేంకటేశ్వరుడి వేయినామాలంత సుదీర్ఘమైనది.
 
త్రిలోక పూజ్యుడికి మూడుపూటలా నివేదించే నిత్య నైవేద్యాలకు అదనంగా ఏరోజుకారోజు ప్రత్యేక ప్రసాదాలూ ఉంటాయి. ప్రతి సోమవారం మలయప్పస్వామికి జరిగే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు సమర్పిస్తారు. బుధవారాలు బంగారు వాకిలి దగ్గర జరిగే సహస్ర కలశాభిషేకంలో అదనంగా క్షీరాన్నాలూ వడ్డిస్తారు. గురువారం నటి తిరుప్పావడంలో దాదాపు నాలుగువందల ఇరవై కిలోల బియ్యంతో చేసిన పులిహోరను బంగారువాకిలి ముందు రాసిగా పోస్తారు. 
 
విష్ణుచక్రమంత జిలేబీలూ, గజేంద్రుడి చెవులంత మురుకులు.. స్వామికి అర్పిస్తారు. దీన్నే అన్నకూటోత్సవమనీ అంటారు. శుక్రవారంనాడైతే.. హోళిగల విందే.. అదనంగా సఖియలనే ఉండ్రాళ్లు కూడా.. భానువారం చల్లనిదేవరకు చలిపిండి నైవేద్యం. ధనుర్వాసంలో గోదావల్లభుడు బెల్లంపుదోసెను మక్కువగా ఆరగిస్తాడు. ఇక, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో ప్రత్యేకమైన గుగ్గుళ్ల ఫలహారం.
 
అమాయకంగా ఆలోచిస్తే ఆదిమధ్యాంత రహితుడికి ఆకలేమిటి, గంగా జనకుడికి దప్పికేమిటి, పాల సముద్రంలో నివసించేవాడికి గోక్షీర నివేదన అవసరమా.. అన్న సందేహం కలుగుతుంది. ఆ భోజనప్రియత్వంలో భక్తజన ప్రియత్వం అంతర్లీనం. ఎండలకు ఎండుతూ, వానలకూ నానుతూ కొండంత ప్రేమతో కొండమీదకి చేరుకునే నానా దిక్కుల నరుల నోళ్లు తీపి చేయడానికే ఇదంతా.. అంటారు.
 
ఆధ్యాత్మికవేత్తలు, నిజమే, వందలమైళ్ళూ ప్రయాణించి, గంటలకొద్దీ నిరీక్షించి, రెప్పపాటు సమయంలో నేత్ర దర్శనం చేసుకుని ఆనందనిలయంలోంచి బయటికొచ్చిన  సామాన్యులకు.. ఆ వజ్రకిరీటమూ, తిరునామాలూ, చిరునగవులూ.. అంతా కలలో చూసినట్టే ఉంటుంది. ఆ ఆధ్యాత్మికానుభూతి నిజమే అనడానికి ఒకటే కొండగుర్తు... కాదుకాదు, ఏడుకొండల గుర్తు.. చేతిలోని ప్రసాదం, నోటిలోని తీయదనం. స్వామివారు భక్తులకిచ్చే తీర్థయాత్రా ధ్రువీకరణ పత్రం తిరుపతి లడ్డూ.