శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 30 జులై 2018 (20:52 IST)

వివేకానందుడికి తినడానికి ఒకరోజు ఏమీ దొరకలేదు... అప్పుడు ఏం జరిగిందంటే?

ఒకసారి స్వామి వివేకానంద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక వడ్డీ వ్యాపారి చ

ఒకసారి స్వామి వివేకానంద  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక వడ్డీ వ్యాపారి చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం ఎవరూ సన్యాసులు అవకూడదు అతడిలా అని స్వామీజీతో అన్నాడు.
 
ఓ స్వామీ... చూడు... చూడు.. నేనెంత మంచి భోజనం చేస్తున్నానో.. నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్లు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. మరి నువ్వో ... ఏ సంపాదనా లేకుండా దేవుడు.. దేవుడూ.. అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక.. తప్ప.. అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.
 
అప్పుడు ఒక అద్బుతం జరిగింది. మిఠాయి కొట్టు యజమాని ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చిన భోజనం పొట్లాం చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ ఎవరు నాయనా నీవు.. నేను నిన్ను ఎరుగనే... పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామీజీ ముందు చిన్నపీట వేసి భోజనం ఒక ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు. 
 
నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది. ఎదురుగా నోరు వెళ్లబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. అశ్రునయనాలతో లేచి వచ్చి స్వామికి సాగిలపడి నమస్కరించాడు. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే... కాబట్టి ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు.