శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 8 అక్టోబరు 2018 (16:50 IST)

తిరుమలలో మరాఠా సైన్యం... తరిమికొట్టిన మద్రాస్ సైన్యం... ఇది ఎప్పుడంటే?

శ్రీవారి ఆలయాన్ని దక్కించుకోవడం కోసం రెండు సేనల మధ్య తిరుమలలో యుద్ధం జరిగిన ఉదంతాలూ చరిత్రలో కనిపిస్తున్నాయి. క్రీ.శ.1759లో మహారాష్ట్ర యోధులు గోపాలరావు, నారాయణరావు తిరుమలను దోపిడీ చేయడానికి వచ్చారు. తిరుమలకు చేరుకునే మునుపే గోపాలరావు వెనుదిరిగాడు. సేనలను నారాయణరావుకు అప్పగించాడు. ఈ సేనలు కరకంబాడికి చేరుకుని, చిన్నపాళేగారును ఆశ్రయించాడు. పాలేగారు సేనలు కూడా కలిసి కరకంబాడి కొండల్లో ప్రయాణం చేసి జూన్‌ 30వ తేదీ రాత్రికి రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
అప్పటికే ఆలయం నిజాం దత్తమండలాల కింద క్రీ.శ.1750లోనే ఈ ప్రాంతం (తిరుమల సహా) ఆంగ్లేయుల వశమయింది. ఆంగ్లేయుల నుంచి తిరుమల ఆలయాన్ని కౌలుకు తీసుకున్న కౌలుదారుని సేనలు తిరుపతిలో ఉన్నాయి. అయితే… తిరుమలలో తిష్టవేసిన మరాఠా, కరకంబాడి పాళేగారు సేనలను ఎదుర్కోగల శక్తి కౌలుదారుని సేనలకు లేదు. 8.07.1759లో మద్రాసు నుంచి మేజర్‌ కలియడ్‌ నాయకత్వంలో 500 మందితో కూడిన సేన తిరుపతికి వచ్చింది. 
 
అయితే అందులో ఎక్కువ మంది తిరుమల కొండ ఎక్కడానికి అనర్హలు (సంప్రదాయం ప్రకారం). కేవలం 80 మందికి మాత్రమే తిరుమలకు వెళ్లే అర్హత ఉందట. ఆ రెండో రోజే పాలేగాడి సైన్యం, మద్రాసు నుంచి వచ్చిన ఆంగ్లేయుల సైన్యాన్ని చుట్టుముట్టాయి. రాత్రి కొంతసేపు పోరాడిన ఆంగ్లేయుల సైన్యం వెనక్కి వెళ్లిపోయిందట. రెండోసారి కూడా పోరాడే ప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేదు.
 
ఆ క్రమంలో మరో దాడిలో మేజర్‌ కలియడ్‌ తన సైన్యంతో కరకంబాడిని ముట్టడించి పాలేగారు విడిదికి నిప్పుపెట్టారట. పాలేగాడు చనిపోయాడు. ఆ తరువాత తిరుమల ఆలయ కౌలుదారు సైన్యం తిరుమలకు చేరుకుని నారాయణరావును, అతని సైన్యాన్ని శ్రీవారి ఆలయం నుంచి తరిమేశాయట.