సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (16:25 IST)

అభిమన్యుడు మరణానికి కారణం అదే.. శ్రీకృష్ణుడు అందుకే..?

Abhimanyu
మ‌హాభార‌తంలో అభిమ‌న్యుడి గురించి తెలియ‌ని వారుండ‌రు. అర్జునుడు, సుభద్రల కుమారుడే అభిమ‌న్యుడు. సుభద్ర శ్రీ‌కృష్ణుడికి చెల్లెలు. అందువ‌ల్ల అభిమ‌న్యుడు శ్రీ‌కృష్ణుడికి స్వ‌యానా మేన‌ల్లుడు. ఇక అభిమ‌న్యుడు త‌ల్లి గ‌ర్భంలో ఉండ‌గానే ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకుంటాడు.

కృష్ణుడు ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా ఛేదించాలో అర్జునుడికి వివ‌రిస్తుంటాడు. ఆ స‌మ‌యంలో సుభద్ర గ‌ర్భంతో ఉంటుంది. ఆమె గ‌ర్భంలో ఉండే అభిమ‌న్యుడు ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకుంటాడు. కానీ శ్రీ‌కృష్ణుడు మాత్రం స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చెప్పి కావాల‌నే అర్జునున్ని మ‌రొక గ‌దిలోకి తీసుకెళ్తాడు. దీంతో అభిమ‌న్యుడికి ప‌ద్మ‌వ్యూహాన్ని ఛేదించ‌డం వ‌ర‌కు మాత్ర‌మే తెలుసు. అందులో నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాలో తెలియ‌దు.
 
మ‌హాభార‌త యుద్ధంలో 13వ రోజు ద్రోణాచార్యుడు కొంత‌మంది కౌర‌వ సేన‌ల‌ను ద్వార‌క వైపు మ‌ళ్లిస్తాడు. దీంతో కృష్ణుడు, అర్జునుడు ఇద్ద‌రూ వారిని ఎదుర్కొనేందుకు ద్వార‌క వైపుకు వెళ్తారు. ఇక మిగిలిన న‌లుగురు పాండ‌వుల‌ను జ‌య‌ద్ర‌తుడు క‌ట్ట‌డి చేస్తాడు. జ‌య‌ద్ర‌తుడు కౌర‌వుల ఏకైక సోద‌రి ద‌స్సుల‌ను వివాహం చేసుకుంటాడు. అందువ‌ల్ల అత‌ను కౌర‌వుల వైపు యుద్ధంలో పాల్గొంటాడు. 
 
అలాగే అత‌నికి పాండ‌వుల‌తో పాత క‌క్ష‌లు ఉంటాయి. ఈ క్ర‌మంలో జ‌య‌ద్ర‌తుడు కేవ‌లం అర్జునుడు, కృష్ణుడి చేతుల్లో త‌ప్ప ఇత‌రులెవ‌రూ త‌న‌ను చంప‌కూడ‌ద‌ని శివుడి నుంచి వ‌రం పొందుతాడు. అలాగే అర్జునుడు కాకుండా మిగిలిన న‌లుగురు పాండ‌వుల‌ను ఒక్క రోజంతా బంధించి ఉంచే వ‌రాన్ని కూడా జ‌య‌ద్ర‌తుడు శివుడి నుంచి పొందుతాడు. దీంతో జ‌య‌ద్ర‌తుడు ఆ న‌లుగురు పాండ‌వుల‌ను ఒక్క రోజంతా బంధిస్తాడు.
 
మ‌రోవైపు ద్వార‌కలో కృష్ణుడు, అర్జునుడు కౌర‌వ సేవ‌ల‌ను ఎదుర్కొంటుంటారు. అయితే అదే అదునుగా భావించిన ద్రోణాచార్యుడు పాండ‌వ సైన్యాన్ని అంతం చేయ‌డం కోసం ప‌ద్మ‌వ్యూహం ప‌న్నుతాడు. దాన్ని ప‌సిగ‌ట్టిన అభిమ‌న్యుడు ముందు వెనుక ఆలోచించ‌కుండా ఆ వ్యూహంలోకి ప్ర‌వేశించి దాన్ని ఛేదిస్తాడు. కానీ బ‌య‌ట‌కు ఎలా రావాలో అత‌నికి తెలియ‌దు. దీంతో చివ‌ర‌కు అభిమ‌న్యుడు క‌ర్ణుని చేతిలో హ‌త‌మ‌వుతాడు. 
 
అయితే ఈ విష‌యం తెలుసుకున్న అర్జునుడు ప్ర‌తీకార జ్వాల‌తో రగిలిపోయి అభిమ‌న్యుడి మృతికి కార‌ణ‌మైన జ‌య‌ద్ర‌తుడిపై పాశుప‌తాస్త్రం వేసి సంహ‌రిస్తాడు. ఈ క్ర‌మంలో అభిమ‌న్యుడి మ‌ర‌ణం పాండవులంద‌రినీ క‌ల‌చి వేస్తుంది. దీంతో వారు మరింత కోపోద్రిక్తులై యుద్ధం చేసి కౌరవుల‌పై విజ‌యం సాధిస్తారు.
 
అయితే నిజానికి కృష్ణుడు కావాలంటే అభిమ‌న్యున్ని ర‌క్షించి ఉండేవాడే. కానీ అందుకు ఓ కార‌ణం ఉంది. అదేమిటంటే.. అభిమ‌న్యుడు చంద్రుని కుమారుడు. చంద్రుడు ముందుగానే కృష్ణుడి నుంచి వ‌రం తీసుకుంటాడు. త‌న కుమారుడు వ‌ర్చుడు అభిమ‌న్యుడిగా జ‌న్మిస్తాడ‌ని.. అత‌ను భూమిపై కేవ‌లం 16 ఏళ్లు మాత్రమే జీవిస్తాడ‌ని, త‌రువాత ఒక్క రోజు కూడా త‌ను అక్క‌డ ఉండ‌డానికి వీలు లేద‌ని, వెంట‌నే త‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌ని చంద్రుడు కోరుతాడు. 
 
అందుకు కృష్ణుడు అంగీక‌రిస్తాడు. అందువ‌ల్లే కృష్ణుడు అర్జునుడికి ప‌ద్మ‌వ్యూహం ఛేదించే విష‌యాన్ని స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చెబుతాడు. మిగిలిన స‌గాన్ని మ‌రొక గ‌దిలోకి తీసుకువెళ్లి వివ‌రిస్తాడు. దీంతో అభిమ‌న్యుడికి ఆ వ్యూహంలోకి వెళ్ల‌డ‌మే తెలుస్తుంది. బ‌య‌ట‌కు రావ‌డం తెలియ‌దు. ఫ‌లితంగా అత‌ను చ‌నిపోయి.. త‌న తండ్రి చంద్రున్ని చేరుకుంటాడు. అదంతా ముందే నిర్ణ‌యించ‌బ‌డింది.. క‌నుక‌నే కృష్ణుడు అభిమ‌న్యున్ని కాపాడ‌లేదు.
 
ఇక ఒక ర‌కంగా చెప్పాలంటే అభిమ‌న్యుడి మ‌ర‌ణం అటు అర్జునుడినే కాదు.. పాండవులంద‌రినీ తీవ్రంగా క‌ల‌చివేస్తుంది. దీంతో తీవ్ర‌ ఆగ్ర‌హావేశాల‌కు లోనై భీక‌ర యుద్ధానికి దిగుతారు. అర్జునుడు అంత‌కు ముందు యుద్ధం చేయాలంటేనే సంశ‌యించేవాడు.. కానీ అభిమ‌న్యుడి మ‌ర‌ణంతో అత‌నిలో యుద్ధ కాంక్ష మ‌రింత పెరుగుతుంది. దీంతో అత‌ను యుద్ధ రంగంలోకి ఏమాత్రం సంశ‌యించ‌కుండా ముంద‌డుగు వేస్తాడు. 
 
కౌర‌వులను నిర్దాక్షిణ్యంగా హ‌త‌మారుస్తాడు. ఆ యుద్ధ కాంక్ష‌ను పెంచేందుకు అభిమ‌న్యుడి మ‌ర‌ణం కార‌ణ‌మ‌వుతుంది. అస‌లు స‌గం దానివ‌ల్లే పాండవులు మ‌రింత భీక‌రంగా యుద్ధం చేసి త్వ‌ర‌గా కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించార‌ని చెప్ప‌వ‌చ్చు.