మంగళవారం, శుక్రవారం ఇతరులకు ఎందుకని డబ్బు ఇవ్వకూడదు?
మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుక మంగళవారం నాడు సాధారణంగా శుభకార్యాలను తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించడం, క్షవరం చేయించుకోవడం పనికి రావు. మంగళవారం అప్పు ఇస్తే డబ్బు తిరిగిరావడానికి చాలా కష్టమవుతుంది. అప్పు తీసుకుంటే అనేక బాధలు కలుగుతాయి.
అప్పు తీరే మార్గం కనిపించదు. శుక్రవారం లక్ష్మీదేవి ప్రతీక. ఈ రోజున ధనాన్ని ఇంటి నుండి బయటకు పంపడమంటే లక్ష్మీదేవిని తృణీకరించడమేనని కొందరి భావన. ఈ కారణం వల్లనే ఇంటి ఆడపిల్లను ఆ రోజున అత్తవారింటికి కూడా పంపించరు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మీ అత్తింటికి వెళ్లిపోతుందన్న భయం.
మరి ఇది నిజమేనా... అని చాలామందికి సందేహం కలుగుతుంది. లక్ష్మీదేవి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుకుని భక్తి ప్రపత్తులతో ఆ తల్లిని తమ ఇంటిలో స్థిర నివాసం చేయమని ప్రార్థించడం ఎవరికైనా మంచిదే కదా. ఈ భావన వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే సంపాదించేవాళ్లు సంపాదిస్తుంటే ఖర్చు చేసే వాళ్లు విపరీతంగా ఖర్చు చేస్తారు.
ఇలాంటి నియమాన్ని పెట్టడం వల్ల కనీసం ఆ రెండు రోజులైనా సరే డబ్బుని ఖర్చుచేయడాన్నీ, సోమరితనాన్ని దూరం చేసుకోవాలన్న సత్సంకల్పం కలుగుతుందని ఆశ. నిజానికి అత్యవసరమైన సమయాల్లో, ఆపద సమయంలో ఇలాంటి నియమనిబంధనల గురించి పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అంతకుమించిన అనర్థాలు జరుగుతాయ్.