శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 10 ఫిబ్రవరి 2018 (21:49 IST)

టిటిడి బోర్డుకు బిజెపి పీటముడి.. ఏంటది?

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం దాదాపు 10 నెలలుగా అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నా బోర్డు ఏర్పాటు కావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే త్వరలో టిటిడి బోర్డును ప్రకటిస్తాం అని అనేక పర్యాయాలు చెప్పి

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం దాదాపు 10 నెలలుగా అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నా బోర్డు ఏర్పాటు కావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే త్వరలో టిటిడి బోర్డును ప్రకటిస్తాం అని అనేక పర్యాయాలు చెప్పినప్పటికీ ఆచరణ రూపం దాల్చడం లేదు. మరోవైపు బోర్డు ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త మాంగాటి గోపాల్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రి పదవి కంటే ఎక్కువగా భావించే టిటిడి ఛైర్మన్‌ను, పాలకమండలి సభ్యులను నియమించడంలో ప్రభుత్వం ఇంత జాప్యం ఎందుకు చేస్తోంది, విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తోంది, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏమిటి.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు 11 నెలల పాటు పాలకమండలిని ఏర్పాటు చేయలేదు. ఆ తరువాత చదలవాడ క్రిష్ణమూర్తి ఛైర్మన్‌గా ధర్మకర్తల మండలిని ప్రకటించారు. మొదట్లో ఈ బోర్డు పదవీకాలం యేడాదికే పరిమితం చేసినా ఆ తరువాత మరో యేడాది పొడిగించారు. రెండేళ్ళ పదవీ కాలం ముగిసి 10 నెలలు అవుతోంది. అప్పటి నుంచి నూతన పాలకమండలిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్, హరిక్రిష్ణ, సిఎం రవిశంకర్, బీదా మస్తాన్ రావు, పుట్టా సుధాకర్ యాదవ్, కోదండరామి రెడ్డి ఇలా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. 
 
టిటిడి ఛైర్మన్ పదవికి ఎంత తీవ్రమైన పోటీ ఉన్నా ఎంపిక చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పెద్ద సమస్య కాబోదు. తమ పార్టీ నాయకులను ఒప్పించి చేయగలరు. అయితే ఇప్పుడు సమస్యంతా మిత్రపక్షమైన బిజెపితోనే. గత పాలకమండలిలో బిజెపి తరపున భానుప్రకాష్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. ఈసారి బిజెపి నుంచి ఇద్దరు సభ్యులను తీసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. పాత బోర్డు రద్దయిన వెంటనే కొత్త బోర్డును ప్రకటించి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అయితే నందమూరి హరిక్రిష్ణ దగ్గర చేర్చుకునేందుకు ఆయనకు ఛైర్మన్ పదవి ఇవ్వజూపారు. ఆయన నిర్ణయం కోసం చాలాకాలం ఎదురుచూశారు. 
 
చంద్రబాబుపై తీవ్రమైన కోపంతో ఉన్న హరిక్రిష్ణ ఛైర్మన్ పదవి తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఇంతలో ఈ పది నెలల కాలంలో బిజెపి, టిడిపి మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతూ వస్తున్నాయి. బడ్జెట్ తరువాత స్నేహబంధం మరింత తెగిపోయే స్థితికి చేరుకుంది. బిజెపి, టిడిపి నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టిటిడి బోర్డు నియామకం సంక్లిష్టంగా మారింది. ప్రస్తుత దశలో బిజెపి సభ్యులకు పాలకమండలిలో స్థానంక కల్పిస్తే బిజెపితో బాగానే ఉన్నారు కదా బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి టిటిడికి కూడా బాధ్యత ఉందనే భావన జనంలోకి వెళుతుంది. 
 
అలాగని బిజెపి వారికి చోటు లేకుండా బోర్డును ప్రకటిస్తే ఆ పార్టీతో స్నేహ బంధం పూర్తిగా తెగిపోయినట్లే అవుతుంది. ఇది బిజెపి నాయకులకు కోపం తెప్పిస్తుంది. అందుకే బోర్డు నియామకాన్ని నాన్చుతూ వస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. బిజెపితో రాజకీయ బంధంపై స్పష్టత వచ్చేదాకా బోర్డును ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు.టిటిడి పాలకమండలి నియామకంలో జరుగుతున్న జాప్యంపై తెలుగుదేశంపార్టీ నాయకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోర్డులో స్థానం ఆశిస్తున్న నాయకులు..ఎప్పుడెప్పుడు బోర్డు ప్రకటిస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ తమ పదవీకాలం తగ్గిపోతుందన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. పదవులు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని పార్టీ నాయకత్వంపై ఒకింత అసహనంతో ఉన్నారు.