బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జులై 2021 (15:54 IST)

బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరివున్న బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. 
 
ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీరాలంమండి గుడి ఛైర్మన్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో పాతబస్తీకి చెందిన భక్తులు అమ్మవారికి బోనం నివేదించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
 
ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది. 
 
గత 12 సంవత్సరాలుగా దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బోనం సమర్పించినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించారు.