శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (09:06 IST)

దుర్గమ్మ భక్తులపై భారీ వడ్డన.. దర్శనం మరింత ప్రియం - బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు!

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం మరింత ప్రియం కానుంది. భక్తులపై అదనపు చార్జీలు వసూలు చేయాలని దుర్గమ్మ ఆలయ పాలక మండలి నిర్ణయించింది. అంటే, దర్శన టిక్కెట్లతో పాటు.. ఇతర ప్రసాదాల ధరలు పెంచాలని తీర్మానించింది. ఈ పెంచిన ధరలు కొత్త సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన దేవస్థానం పాలకమండలి సమావేశంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించారు. 
 
ముఖ్యంగా, ప్రతి రోజూ సాయంత్రం పంచహారతుల సమయంలో రూ.500 ఆర్జిత సేవా టికెట్‌పై ఇద్దరు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. జనవరి 1నుంచి ఈ టికెట్‌పై ఒకరిని మాత్రమే అనుమతించనున్నారు. 
 
ఇకపై పంచహారతుల సమయంలో దంపతులు పంచహారతుల సేవకు వెళ్లాలంటే రూ.1,000 సమర్పించుకోవాల్సిందే. అలాగే అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని ప్రస్తుతం 150 గ్రాముల ప్యాకెట్‌ రూ.5కు విక్రయిస్తున్నారు. ఇకపై 200 గ్రాముల పులిహోర ప్యాకెట్‌ను రూ.10కు విక్రయించాలని నిర్ణయించారు.
 
మరోవైపు తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతి కోసం దేవదాయశాఖ కమిషనర్‌కు పంపేందుకు తీర్మానాన్ని ఆమోదించారు. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 6-9 గంటల వరకు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ నిర్వహించేందుకు పాలకమండలి తీర్మానం చేసింది.