కొండపై హోటళ్లల్లో తగ్గిన ధరలు.. (video)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన ఏడు కొండలపై స్వామి దర్శనానికి వచ్చే భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వ్యాపారులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. దీంతో వందలు దండుకున్న హోటల్ యజమానులు,
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసిన ఏడు కొండలపై స్వామి దర్శనానికి వచ్చే భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న వ్యాపారులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. దీంతో వందలు దండుకున్న హోటల్ యజమానులు, అధికారుల కఠిన వైఖరితో దిగొచ్చారు. హోటల్ వ్యాపారులు తాము అమ్మే ఆహారపదార్థాలపై ధరలు సగానికి సగం తగ్గించేశారు. హైకోర్టు, టీటీడీ సూచనల మేరకు ధరల పట్టికలు హోటళ్ల ముందు పెట్టారు.
నిన్నటివరకూ రెండు ఇడ్లీల ధర రూ. 25 కాగా, ఇప్పుడది రూ. 7.50కు తగ్గింది. అలాగే రూ.15 వరకూ అమ్మిన టీ ధర ఇప్పుడు రూ. 5 మాత్రమే. ఇక వంద రూపాయలు పలికిన భోజనం ధర రూ.31కి దిగివచ్చింది. ఇక వెజ్ బిర్యానీ ధర రూ.50 నుంచి రూ.19కి తగ్గింది. ఫ్లేట్ మీల్స్ ధర రూ.60 నుంచి రూ.22.50కి తగ్గింది. ఇలా అన్నీ రకాల ఆహార పదార్థాలు ధరలు తగ్గాయి.
అంతేగాకుండా పట్టికలో చూపిన ధరల కంటే ఎక్కువ అమ్మితే.. ఫిర్యాదు చేయాల్సి ఫోన్ నెంబర్లను కూడా హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే ఆహార పదార్థాల ధరలు తగ్గించడంతో వ్యాపారులు వాపోతున్నారు. తాము చెల్లిస్తున్న నెలవారీ అద్దెలు భారీగా ఉంటున్నాయని, వాటిని తగ్గిస్తేనే తాము వ్యాపారాలు చేసుకోగలమని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో చర్చించి త్వరలోనే నిర్ణయానికి వస్తామని టీటీడీ అధికారులు హామీ ఇచ్చారు. కొండపై ఆహార పదార్థాల ధరలు తగ్గడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన ధరలతో హోటల్ యజమానులు రెండు రోజులు హడావుడి చేసి వదిలేయకుండా.. పక్కాగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.