హర...హర.. మహాదేవ.. శంభోశంకరా... ఓంశక్తి... ఓం నమశ్శివాయ.. అంటూ భక్తుల శివ నామస్మరణతో కృష్ణలంక ప్రాంతం ఆదివారం సాయంత్రం మారుమ్రోగింది.
ప్రస్తుతం సంభవిస్తున్న విపత్తుల కారణంగా అనేక రకాలుగా బాధపడుతున్న మానవాళికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రాప్తించాలనే సంకల్పంతో, లోక కళ్యాణార్థం గడ్డం వి.ఎన్.ఎ.గణేష్, తల్లం సురేష్ బాబు సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని బియ్యపుకొట్ల బజారులో ఆదివారం సాయంత్రం మృత్తికా (మట్టి) శివ లింగానికి నిర్వహించిన మహా రుద్రాభిషేకం ఆధ్యాంతం నేత్రపర్వంగా సాగింది.
అమ్మ చారిటబుల్ ట్రస్ట్ (గుంటూరు) ఆధ్వర్యంలో అమ్మ ఆశ్రమం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామి (బాబాగారు), ఆశ్రమ సేవకులు పాల్గొని మహా శివునికి విభూది, పసుపు, కుంకుమ, రుద్రాక్షలు, అన్నం, పన్నీరు, పంచామృతాలు, నెయ్యి, పాలు, పెరుగు, తమలపాకులు, పండ్లు, వివిధ రకాల పుష్పాలతో 40నిమిషాల పాటు నిరాంటంకంగా నిర్వహించిన అభిషేకాలు వేలాదిగా తరలివచ్చిన భక్తులను తన్మయత్వం చేశాయి.
కైలాసమే భువికి దిగి వచ్చిందా... సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడే విచ్చేసి తమను అనుగ్రహించాడా అన్న రీతిలో సాగిన రుద్రాభిషేకాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. అభిషేకాలు జరుగుతున్నంతసేపు తమను తాము మరచిపోయి హర..హర మహాదేవ... శంభో..శంకరా... పరమేశ్వరా.. పాహిమా.. పాహిమాం.. అంటూ నినదించారు.
అభిషేకాలు అనంతరం స్వామివారిని పసుపు, కుంకుమ, విభూదితో శోభాయమానంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించి మహా హారతిని గావించారు. రుద్రాభిషేకంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంతో పాటు లోక కళ్యాణార్థం మహా శివునికి రుద్రాభిషేకం నయన మనోహరంగా నిర్వహించడం అభినందనీయం అని పేర్కొన్నారు.
ఇటువంటి మహోత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను, నేత్రపర్వంగా రుద్రాభిషేకం నిర్వహించిన అమ్మ ఆశ్రమం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామి (బాబాగారు)ని అభినందించారు. మహా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రాబోయే కార్తీకమాసంలో పున్నమీఘాట్‌లో రుద్రాభిషేకం నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా రుద్రాభిషేకం అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రుద్రాభిషేకం అనంతరం అమ్మ ఆశ్రమం సేవకులు మాట్లాడుతూ ప్రజల్లో దైవభక్తితో పాటు దేశభక్తి కూడా పెంపొందాలని అప్పుడే మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుందన్నారు.
నింగికెగిరిన జాతీయ జెండా వెనుక నేలకొరిగిన సైనికులు, సమరయోధులు అనేక మంది త్యాగధనుల ప్రాణాలు ఉన్నాయని మరువకండి అంటూ సూచించారు. ఆ త్యాగమూర్తులకు మరణమే లేదని చాటేలా ప్రతి ఇంటా జాతీయ జెండా ఉండేలా దీక్ష చేపట్టి దేశం పట్ల మన బాధ్యతను నిరూపించుకోవాలని సూచించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి రుద్రాభిషేకాన్ని తిలకించారు.