తితిదే కొత్త పాలక మండలి సభ్యులు వీరేనా?
తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ధర్మకర్తల మండలికి సభ్యుల పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో పాలకమండలి సభ్యుల పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి కూడా పంపించింది. పరిస్థితుల్లో ప్రభుత్వం ఖరారు చేసిన పేర్ల జాబితా తాజాగా లీకైంది. ఈ కొత్త పాలక మండలిలో ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటుకల్పించినట్టు సమాచారం.
ఇందులో తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథి రెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డి ఏపీ నుంచి గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జున రెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్, పార్థసారథి, ఢిల్లీ నుంచి శివశంకరన్, మహరాష్ట్ర నుంచి రాజేష్ శర్మ, కర్ణాటక నుంచి రమేష్ శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి, తమిళనాడు నుంచి వైద్యనాథన్, శ్రీనివాసన్, డా.నిశ్చిత, కుమారగురు ఉన్నారు.
అయితే, ఏపీలో ప్రకటించిన పేర్లను చూస్తే మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారిలో పలువురుకి తితిదే పాలక మండలిలో సభ్యత్వం కల్పించినట్టు సమాచారం.