గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:01 IST)

ఆధునికీకరణ దిశగా అహోబిల దేవాలయ పరిపాలనం

Lord Narasimha
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధునిక సాంకేతికత దిశగా అడుగులు వేస్తున్నది. ఏటా లక్షల్లో విచ్చేస్తున్న భక్తులకు మెరుగైన సేవలు అందించడం కోసం, ఆలయ పరిసరాల శుభ్రత మరియు భక్తుల భద్రత కోసం, ఆలయ పరిపాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంపొందించడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు నిర్ణయించారు. 24.7.2023 సోమవారం నాడు సాయంత్రం శ్రీ పీఠాధిపతి వారు ఆలయ పరిపాలనం కోసం శ్రీ అహోబిల మఠం యొక్క ప్రణాళికలను వివరించారు.
 
ఎంటర్టైన్‌ రిసోర్సు ప్లానింగ్‌( సంస్థ వనరుల ప్రణాళిక) ద్వారా ఆలయ వ్యహారాలన్నింటిని మొత్తం మూడు దశలలో పూర్తిగా డిజిటలైజ్‌ చేయనున్నారు. మొదటి దశలో వెబ్సైట్‌ రూపొందించి భక్తులు ఆన్లైన్ లోనే సేవా టికెట్లు, రూమ్‌‌ల నమోదు,కార్యాలయ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్లో జరుపుకునే విధంగాను, ఎలక్ట్రానిక్‌ భద్రత వ్యవస్థలను ఏర్పాటు చేసే పనులను పూర్తిచేస్తారు.
 
రెండవ దశలో మొదటి దశ పనులను మరింత బలోపేతం చేస్తూ, సీసీటీవీ కెమెరాలను,ప్రజా సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసి భక్తుల భద్రతలపై దృష్టి సారిస్తారు. మూడవ దశలో స్మార్ట్‌ లైటినింగ్‌, వీడియో వాల్స్‌ ఏర్పాటు ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించనున్నారు. సోమవారం సాయంత్రం శ్రీ అహోబిల మఠంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఠాధిపతి మాట్లాడుతూ, అహోబిల క్షేత్రం కాలాంతరంలో ఎన్నో మార్పులకు గురి అయినదని, ప్రతి మార్పు క్షేత్రాభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు. తనకు పూర్వం ఉన్న పీఠాధిపతుల బాటలోనే తాను కూడా నడుస్తూ క్షేత్రాభివృద్ధికి పాటుపడతామన్నారు.
 
అహోబిల నరసింహా స్వామి వారి దయతో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి భద్రత ఆధ్యాత్మిక అనుభూతిని పెంచాలని ఆకాంక్షించారు. ఒకవైపు ప్రాచీన సంప్రదాయాలను కొనసాగిస్తూనే ,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సేవలు అందించడం శ్రీ అహోబిల మఠం ముఖ్య ఉద్దేశమని పీఠాధిపతి వారు పునరుద్ధాటించారు.