తిరుమలలో కరోనావైరస్‌ను తరిమికొడుతున్న టిటిడి సిబ్బంది.. ఎలా?
తిరుమలలో కరోనావైరస్‌ను తరిమికొట్టడమేంటని ఆశ్చర్యంగా అనిపిస్తుందా? భక్తులకు వైరస్ సోకకుండా, టిటిడి సిబ్బంది కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు టిటిడి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా స్వామివారికి భక్తులు సమర్పించే తలనీలాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు టిటిడి అధికారులు. ఈ సందర్భంగా అధికారులను ఈఓ అభినందించారు.
టిటిడి ఈవో డా. కెఎస్. జవహర్‌రెడ్డి సోమవారం అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి తిరుమలలోని కల్యాణకట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా కల్యాణకట్ట వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్రతి రోజు టిటిడిలోని అన్ని విభాగాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కల్యాణకట్టలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు పరిశీలించినట్లు తెలియజేశారు.
శ్రీవారి భక్తులు సులువుగా, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ - 19 దృష్ట్యా కల్యాణకట్టలో భక్తుల ఆరోగ్య భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. టిటిడి కల్పిస్తున్న వసతులపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. అంతకుముందు ఈవో కల్యాణకట్టలోని తలనీలాలు సమర్పించే హాల్‌లు, టోకెన్లు ఇచ్చే కౌంటర్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.