వరలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
శ్రావణ మాసం రెండో శుక్రవారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో నిష్టతో, భక్తి శ్రద్ధలతో చేస్తారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలగాలని వరలక్ష్మిని కొలుస్తారు.
రోజంతా ఉపవాసం ఉండటంతో పాటు ముత్తైదులకు తాంబూలాలు, వాయనాలు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అయితే ఇదేసందర్భంలో కరోనా మహమ్మారి శాపంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువైవున్న కనకదుర్గమ్మ వరలక్ష్మీ దేవిగా దర్శనమిస్తోంది. ఉదయం 8 గంటలకు దేవస్ధానం ఆధ్వర్యంలో వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు.
అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మహిళలకు ఆలయ అధికారులు, వైద్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు ఓ సూచన చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు.. పూజ అనంతరం ముత్తైదులను ఇంటికి పేరంటాలకు పిలవడం.. వాయనాలు, తాంబూలాలు ఇవ్వకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడం, వారు కూడా ఇతరుల ఇళ్లకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుడికి వెళ్లిన భక్తులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులతో పాటు.. భౌతికక దూరం మరవొద్దు. లేదంటే కొవిడ్ మహమ్మారిని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది.