శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (10:30 IST)

వాహనాల్లో మంటలు.. ఆందోళనలో చోదకులు... దగ్దమైన టాటా ఏస్‌

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మధ్యకాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, వాహనాల్లో ఈ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఈ జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో రెండు వాహనాల్లో మంటలు చెలరేగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 
 
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయ సమీపంలో టాటా ఏస్​ వాహనంలో మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్​ వాహనం దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. నర్సంపేట నుంచి ములుగు జిల్లా దేవగిరిపట్నం గ్రామానికి బియ్యం తీసుకొచ్చేందుకు టాటా ఏస్​లో డ్రైవర్​ వంశీతోపాటు అతని మిత్రులు సంతోష్, విజేందర్ కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
గట్టమ్మ దేవాలయ సమీపంలోకి రాగానే ఇంజన్​ మంటలు వచ్చాయి. గమనించిన వంశీ మిత్రులతో కలిసి బయటకి దూకారు. అక్కడే.. గట్టమ్మ దేవాలయం సమీపంలో సమావేశం నిర్వహించుకుంటున్న బీజెవైఎం నాయకులు ప్రమాదాన్ని పసిగట్టి సంఘటన స్థలానికి చేరుకున్నారు. 
 
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో పక్కనే ఉన్న కుంటలో నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తి చేపట్టారు. 
 
మరోవైపు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రధాన రహదారి మార్గంలో ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. ధన్వాడ గ్రామం నుంచి కాటారం వైపు కారు వెళ్తున్న క్రమంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వాహనంలో షార్ట్ సర్క్యూట్​తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో మంటలు గమనించిన డ్రైవర్​ వెంటనే కారు దిగాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. ఫైర్​ సిబ్బంది వచ్చి మంటలు అర్పారు. కానీ కారు అప్పటికే కాలిపోయింది.