సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (12:13 IST)

కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే..ప్రాణాలు విడిచాడు

కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే.. తింటున్న వ్యక్తి తింటున్నట్లే ప్రాణాలు పోయాయి అని వింటుంటాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి అలానే తుదిశ్వాస విడిచాడు. రొట్టెను తుంచుకునేందుకు దాని మీద పెట్టిన చేయి అలానే ఉండగా.. కూర్చున్న స్థితిలోనే నోటిలో రక్తం కారుతూ మృత్యువాతపడ్డాడు.

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసేసరికి సుమారు 24 గంటలు అయింది. అప్పటికి అదే స్థితిలో కట్టెలా మృతదేహం బిగుసుకుపోయి ఉంది. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం దండుపల్లికి చెందిన కాసాల సాయిలు(46) మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పాలట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు మధ్యాహ్నం హాజరయ్యాడు.

అదే రోజు తూప్రాన్‌ మీదుగా స్వగ్రామానికి బయలుదేరి, తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ వద్ద మద్యం తాగేందుకు ఆగాడు. మద్యం, ఆహారం తెచ్చుకొని తూప్రాన్‌-గజ్వేల్‌ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చుని.. తినడానికి చేతిని ఆహారంలో పెట్టి గుండెపోటుతో అలానే చనిపోయాడు.

సాయిలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకగా సాయిలు మృతదేహం కనిపించింది.

వ్యవసాయం చేసుకునే సాయిలుకు పిల్లలు లేరు. ఈ ఘటనపై తూప్రాన్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు అమర్‌సింగ్‌ను అడగగా.. సైలెంట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని.. దీంతో నొప్పి, ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోతాయని వివరించారు.