శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (13:22 IST)

షర్మిలమ్మకు అండగా రాములమ్మ...

వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిలకు కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి విజయశాంతి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షర్మిలను లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ కేడర్‌లు అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్‌కు షర్మిల ఇటీవల ఫిర్యాదు చేసింది. 
 
ఈ వ్యవహారంపై సినీ నటి విజయశాంతి స్పందించారు. వైఎస్.జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై విజయశాంతి ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
అసలే రాజకీయాల్లో మహిళను అణగదొక్కుతూ, వారిని వేధిస్తూ పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విజయశాంతి మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయని ఆమె చెప్పారు.
 
ఈ పరిస్థితిని అధిగమించడం కోసం, పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ఇది 40 సంవత్సరాల నుంచి సినిమా, రాజకీయాలలో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తన స్పష్టమైన అభిప్రాయమని ఆమె చెప్పారు.