1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:22 IST)

కేసీఆర్ మంత్రివర్గంలోని సగం మంది తెలంగాణ వద్దన్నవారే.. : ఈటల రాజేందర్

etela rajender
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారిలో సగం మంది మంత్రులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వారేనని ఆ పార్టీ మాజీ నేత, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 
 
మంగళవారం యాదగిరిగుట్టలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. 'భాజపాపై పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా కేసీఆర్‌ పట్టించుకోలేదు. ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు.. ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుంది. 
 
ముఖ్యంగా, తెరాస మంత్రుల్లో సగం మంది తెలంగాణ వద్దన్న వాళ్లే. కేసీఆర్‌ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఈ 8 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదు. ఇదే మోడీకి, కేసీఆర్‌కు ఉన్న తేడా అని చెప్పారు. 
 
తెరాస నేతలు దళితుల అసైన్డ్‌ భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్‌ ఉంటే ప్రగతిభవన్‌లో.. లేకపోతే ఫామ్‌హౌస్‌లో ఉంటారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రారు. దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్నారు. దళితుల అసైన్డ్‌ భూములను లాక్కుంటున్నారు. ఫారెస్టు భూముల పేరుతో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే అవకాశం నల్గొండలో రాబోతోంది అని ఈటల జోస్యం చెప్పారు.