ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్.. షాకైన సజ్జనార్
ఆర్టీసీ బస్సులో ఎక్కితే టిక్కెట్ తీసుకోవాల్సిందే. లగేజీలతో పాటు చిన్నపిల్లలకు కూడా బస్పులో టికెట్ తీసుకోవాల్సిందే. పిల్లలకు అయితే హాఫ్ టికెట్.. పెద్దవాళ్లకు ఫుల్ టికెట్ అడుగుతారు కండక్టర్లు. తాజాగా ఓ కండక్టర్ కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ కండక్టర్ కోడిపుంజుకు ఎంత ఛార్జీ వసూలు చేశాడో తెలుసా.. అక్షరాలా రూ.30. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తోంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కాడు.
కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. అతడి వెంట ఓ కోడిపుంజు కూడా ఉంది. బస్సు సుల్తానాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో కండక్టర్ తిరుపతికి కోడిపుంజు శబ్దం వినిపించింది. వెంటనే.. కోడికి రూ.30 టికెట్ కొట్టి అలీ చేతికిచ్చాడు కండక్టర్.
ఆ టికెట్ చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అదేంటీ కోడికి టికెట్ ఏంటి? అని అన్నాడు. ప్రాణంతో ఉండే ప్రతీ జీవికి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పడంతో ప్రయాణికుడికి షాక్ తప్పలేదు. చేసేది ఏమిలేక టికెట్కు చిల్లరతో ఇచ్చేశాడు.
నెటిజన్లు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన సజ్జనార్.. వెంటనే దృష్టి సారిస్తామని సమాధానమిచ్చారు.