గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (21:51 IST)

తెలంగాణాకు 50 యేళ్లకు వడ్డీలేని రుణం.. ఏపీకి కేంద్రం మొండిచేయి!

currency notes
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రత్యేక సాయం కింద భారీగా నిధులను కేటాయించింది. ఏకంగా 50 యేళ్లకు ఒక్క పైసా వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేసింది. 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద కేంద్రం రూ.56,415 కోట్లను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.2,102 కోట్లను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం కింద ఈ నిధులను కేటాయించింది. ఇందులోభాగంగా తెలంగాణాతో పాటు మొత్తం 16 రాష్ట్రాలకు ఈ నిధులను కేటాయించగా, ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. 
 
2023-24 ఆర్థిక బడ్జెట్‌లో కేంద్ర స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 50 యేళ్లకుగాను కేంద్రం వడ్డీ లేని రుణాన్ని ఈ రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులోభాగంగా, రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 
 
ఈ నిధులను విద్య, వైద్య, నీటి పారుదల, మంచినీటి పథకం, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం కోసం వినియోగించవచ్చు. ఈ పథకం కింద ప్రస్తుతానికి నిధులు అందుకోనున్న రాష్ట్రాల్లో తెలంగాణాతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ నిధుల కేటాయింపు విషయానికి వస్తే అత్యధికంగా బిహార్ రాష్ట్రానికి రూ.9,640 కోట్లను కేంద్రం కేటాయించింది.