బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:57 IST)

త్వరలో ఢిల్లీకి సీఎం కేసీఆర్‌!

టీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్‌ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి హస్తిన పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతరత్రా నిధుల విడుదల, విభజన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రధానిని కలుస్తానని సీఎం కేసీఆర్‌ చాలా రోజుల కిందటే ప్రకటించారు.

‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు ముందు ఆయన ఢిల్లీకి వెళ్లినా.. ఓ పెళ్లి విందుకు హాజరై తిరిగి వచ్చారు. అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతోనే ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కలవలేకపోయారని అప్పట్లో టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి.

తాజా రాజకీయ పరిణామాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అన్నింటికంటే మించి మోదీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంతోపాటు కేంద్ర ఆర్థిక విధానాలను సీఎం కేసీఆర్‌ తప్పుబడుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసారి మోదీ ఆహ్వానం మేరకే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. 17న కేసీఆర్‌ పుట్టిన రోజు.

ఆలోపే ఆయన ఢిల్లీ వెళతారని అంటున్నా.. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యులు ధ్రువీకరించటం లేదు. పర్యటన షెడ్యూల్‌ శుక్రవారం రాత్రి వరకు ఖరారు కాలేదు.