తెలంగాణా పాలి'ట్రిక్స్' - సీఎల్పీ భేటీని బాయ్‌కట్ చేసిన జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో విధంగా రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్కో నేత అలకపాన్పునెక్కుతున్నారు. మొన్నటివరకు సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుగుబాటు నేతగా ఉన్నారు. ఆయనను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఇపుడు ఆ పార్టీకి చెందిన మరో బలమైన నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలకపాన్పునెక్కారు. ఆదివారం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరిరగింది. ఈ సమావేశాన్ని ఆయన బాయ్‌కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు చేదు అనుభవం ఎదురైందన్నారు. తనను అవమానించేవాడు కాంగ్రెస్ పార్టీలో ఎవడూ లేదన్నారు. మెదక్ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
ఈ పద్దతి తనకు నచ్చలేదన్నారు. అందుకే సీఎల్పీ సమావేశానికి అంతరాయం కలగకూడదనే తాను సమావేశం నుంచి వెళ్లిపోతున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో అనేక విషయాలు మాట్లాడేందుకు వచ్చానని, కానీ పార్టీ విషయాలు మినహా ఇతర విషయాలు మాట్లాడకూడదని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చెప్పారని, అందుకే సీఎల్పీ సమావేశానికి గైర్హాజరవుతున్నట్టు చెప్పారు.