షార్ట్ సర్క్యూట్ : గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పలు వార్డుల్లోకి పొగ వ్యాపించడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. బాలింతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంకానీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గాంధీ ఆస్పత్రి నాలుగో అంతస్తులో లేబర్ డిపార్ట్‌మెంట్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు ఆందోళనతో కేకలు వేశారు. మంటలను చూసి అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. ఫైరింజన్ సర్వీసుకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేయడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు.