సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

మావోడి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదలు : పవన్ కళ్యాణ్

గత నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.
 
'విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. అది ఏమిటంటే.. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో శుక్రవారం ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్‌' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు 
 
అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. 'అనుకోని రీతిలో ప్ర‌మాదం బారిన ప‌డి గ‌త నెల రోజులుగా చికిత్స పొందిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కోలుకొని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావ‌డం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని క‌లిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు అందుకొని ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు మ‌రింత‌గా పొందాల‌ని శక్తి స్వ‌రూపిణిని ప్రార్ధిస్తున్నాను.
 
తేజ్ ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుండి అభిమానులు ఎంతో బాధ‌ప‌డి.. తేజ్ క్షేమంగా ఉండాల‌ని కోరుకున్నారు. ఆల‌యాల్లో, ప్రార్ధ‌న మందిరాల్లో పూజ‌లు చేశారు. వారంద‌రి ప్రార్ధ‌న‌లు ఫ‌లించాయి. ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను' అని ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ ప్రకటనలతో మెగా ఫ్యాన్స్ సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు.