గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (18:13 IST)

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ‌ ఆఫర్ : గవర్నర్ కోటా అంటే ఆషామాషీనా?

తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఆ తర్వాత ఈయన పేరును హుజురాబాద్ తెరాస అభ్యర్థిగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, సీఎం కేసీఆర్ మరోలా ఆలోచించి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు. ఇపుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. ఈ మేరకు ఫైల్‌ను గవర్నర్ తమిళిసైకి పంపించారు.
 
అయితే ఇంతవరకు రాజ్ భవన్ నుంచి ఈ అంశంపై ఎలాంటి స్పందన రాలేదు. ఇది తెరాసలో శిబిరంలో టెన్షన్ పుట్టిస్తోంది. ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పెండింగ్‌లో పెట్టేశారు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై బుధవారం స్పందించారు.
 
రాజ్‌భవన్‌లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... కౌశిక్‌ను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని ఆమె అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని... ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.