హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా నిన్న మలక్‌పేటలో పురాతన కట్టడం కుప్పకూలింది. గత 15 రోజులుగా పాత భవనాలు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇస్తున్నారు. వర్షంతో ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.
కులడానికి సిద్ధంగా ఉన్న భవనాలపై అధికారులు ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మరోవైపు నగరంలో బధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తునే ఉంది. నగరంలో భారీ వర్షం కురవడంతో పలు కాలనీలలోకి భారీగా వరద నీరు చేరింది.
అమీర్ పేట్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, క్రిష్ణానగర్, సనత్ నగర్, మూసాపేట్, కూకట్ పల్లి, ఆబిడ్స్, కోఠీ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
అంతేకాకుండా అంబర్ పేట మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి. ఉప్పల్‌లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హయత్‌నగర్ 19.2, సరూర్‌నగర్ 17.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.