తెలంగాణాలో భానుడి ప్రతాపం - వడదెబ్బకు ఐదుగురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణతాపం కారణంగా అనేక వడదెబ్బకు గురవుతున్నారు. తెలంగాణాలో వడదెబ్బ తగలడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్క రోజే వీరంతా చనిపోయారు.
మృతులను ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూలు మండలం రాజులగూడకు చెందిన గుణాజీ అనే ఆరేళ్ళ బాలుడు, అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బాలాజీ (45)లు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బోధ్ మండలంలో ఓ నిర్మాణ కూలి (32), సూర్యాపేట నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య (48), యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ (45)లు కూడా వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు గరిష్ట స్థాయిలోఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, పగటి ఉష్ణోగ్రతలపై జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ హెచ్చరికను కూడా జారీచేశారు. కాగా, సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్‌లో సోమవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.