ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

పనిమనిషిని నిర్బంధించి... అత్యాచారం చేసిన యజమాని

హైదరాబాద్ నగరంలో ఓ పని మనిషిపై ఇంటి యజమాన్ని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళను ఇంట్లోనే 15 రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజమండ్రికి చెందిన 45 యేళ్ళ మహిళ ఒకరు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే భర్త వదిలిపెట్టడంతో విడిగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. 
 
ఆర్థిక ఇబ్బందులు తీరకపోవడంతో ఇళ్లల్లో పనులు చేస్తానంటూ ఆమె స్నేహితురాలు ధనలక్ష్మికి చెప్పింది. దీంతో రవీందర్‌ అనే వ్యక్తిని ధనలక్ష్మి పరిచయం చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో వంటపని, ఇంటిపని కోసం పిలిచారని, మంచి జీతం ఇస్తారని ఆ మహిళను రవీందర్ నమ్మించాడు. 
 
దీంతో ఫిబ్రవరి 17వ తేదీన రాజమండ్రి నుంచి రైలులో హైదరాబాద్‌కు వచ్చింది. అదేరోజు ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 19వ అంతస్తులోని ఫ్లాట్‌ నంబరు 1905లో ఉదయభాను అనే వ్యక్తి నివాసానికి చేరుకుంది.
 
తొలుత సాదరంగా ఆహ్వానించిన ఉదయభాను తనకు చిత్రపరిశ్రమకు చెందిన వారితో సంబంధాలున్నాయని, గుత్తేదారుగా పనిచేస్తున్నానని చెప్పాడు. తన ఇంట్లోనే ఒక చిన్న గదిని ఆమెకు కేటాయించాడు. ఇక రెండోరోజే ఉదయభాను ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. 
 
దాడిచేశాడు. ఆ రాత్రే ఆమెపై లైంగికదాడి చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆమె వద్ద ఉన్న చరవాణిని లాక్కున్నాడు. ఇంట్లో పనులు చేయించుకుని బయటకు వెళ్లేప్పుడు ఆమెను గదిలో నిర్బంధించేవాడు. ఇలా రోజూ విపరీతంగా కొట్టి అత్యాచారం చేసేవాడు. 
 
ఎలాగైనా అతని చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆమె ఉదయభానుకు తెలియకుండా శుక్రవారం రాత్రి తన చరవాణిని తీసుకుంది. శనివారం ఉదయం 10 గంటలైనా ఉదయభాను రాకపోవడంతో వెంటనే తన కుమార్తెకు ఫోన్‌ చేసింది. 
 
అప్రమత్తమైన బాధిత మహిళ కూతురు చరవాణి సిగ్నల్స్‌ ఆధారంగా గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్కొండ పోలీసులు బంజారాహిల్స్‌ ఠాణాకు విషయాన్ని వివరించగా.. ఎస్సై వాసవి, ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొన్నారు. 
 
19వ అంతస్తుకు వెళ్లిన వారు తాళం వేసి ఉండటంతో ఉదయభానుకు ఫోన్‌ చేశారు. అతని ఫోన్‌ అందుబాటులో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే అతడి కుటుంబ సభ్యులు ఇంటి తాళం తీసుకొని రావడంతో మహిళను రక్షించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయభానుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిపై గతంలోనూ కేసులున్నాయని వివరించారు.