ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేని బ‌డ్జెట్ ఇది.. భట్టి విక్రమార్క

bhatti vikramarka
ఎం| Last Updated: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:25 IST)
ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర రావు ప్ర‌వేశ‌పెట్టిన్ బ‌డ్జెట్ లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌న‌లు గుప్పించారు.

సోమ‌వారం బ‌డ్జెట్ అనంత‌రం మాజీ మంత్రివ‌ర్యులు, మంథ‌ని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ఎమ్మెల్యేలు సీత‌క్క‌, పొడేం వీర‌య్య‌, మాజీ ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డితో క‌ల‌సి బ‌ట్టి విక్ర‌మార్క సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా భట్టి విక్ర‌మార్క మ‌ల్లు ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

అంచ‌నాల‌కు వాస్త‌వాల‌కు పొంత‌న లేకుండా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌లుకోసం కేసీఆర్ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతుంద‌ని ఆశించిన ప్ర‌జ‌ల‌కు ఇది ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని అన్నారు. ఈ బ‌డ్జెట్
లో ఏమీ లేద‌ని ఆయ‌న అన్నారు.

హామీల‌ను అమ‌లు చేయ‌లేక చేతులు ఎత్తేసింద‌ని.. ఆ విష‌యం ఈ బడ్జెట్ తో స్ప‌ష్టం అవుతోంద‌ని భ‌ట్టి అన్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల అనంత‌రం కేవ‌లం ఆరు నెల‌ల కోసం టాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ 2019-20ని ప్ర‌వేశ పెట్టిన ప్ర‌భుత్వం దేశంలో తెలంగాణ ప్ర‌భుత్వ‌మేన‌ని భ‌ట్టి విక్ర‌మార్క విమ‌ర్శించారు.

ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ల‌క్షా 82 వేల 17 కోట్ల రూపాయ‌లతో ప్ర‌వేశ‌పెట్టారు.. తాజాగా ఆరు నెల‌ల త‌రువాత నేడు సాధార‌ణ బ‌డ్జెట్ ను సాధార‌ణ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టి చేతులు ఎత్తేశార‌ని అన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌తి బడ్జెట్ లో అంచ‌నాల‌కు.. వాస్త‌వాల‌కు మ‌ధ్య అంత‌రం 20 నుంచి 25 శాతంగా ఉంటోంద‌ని కొన్నిసార్లు ఇది 30 శాతంగాకూడా ఉంటోంద‌ని ఆయ‌న మీడియాకు వివ‌రించారు.

అయితే ఈ బ‌డ్జెట్ లో వ్య‌త్యాసం మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని అన్నారు. ప్ర‌పోజ్డ్ బ‌డ్జెట్ లోనే స్ట్రెయిట్ గా 20 శాతం వ్య‌త్యాసం ఉంద‌ని అన్నారు. ల‌క్షా 82 వేల 17 కోట్ల ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌గా.. సాధార‌ణ బ‌డ్జెట్ ల‌క్షా 46 వేల 492 కోట్ల‌కు త‌గ్గింద‌ని అన్నారు.

దాదాపు నేరుగా వ్య‌త్యాసం 36 వేల కోట్ల రూపాయ‌ల‌ని అన్నారు. ప్ర‌పోజ‌ల్స్ లోనే ఇంత వ్య‌త్యాసం ఉంటే.. రెగ్యుల‌ర్ గా వాస్త‌వాల‌కు వ‌చ్చేస‌రికి.. ఎంత తేడా ఉంటుందో ఊహించుకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.


ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ లో రూ. ల‌క్ష 82 వేల 17 కోట్ల‌తో ఉంటే.. వాస్త‌వాల్లోకి వ‌చ్చే స‌రికి వ్య‌త్యాసం రూ.60 వేల కోట్లు ఉంద‌ని అన్నారు. ఇంత భ‌యంకరంగా, వాస్త‌వాల‌కు దూరంగా బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని భ‌ట్టి అన్నారు.

అద్భుతాలు చేస్తున్నార‌నే భ్ర‌మ‌లు క‌ల్పించి, అంతా బ్ర‌హ్మాండంగా ఉంద‌ని మాట్లాడే ముఖ్య‌మంత్రిగారికి వారి ప‌రిపాల‌న వ‌ల్ల‌.. ఆర్థిక స్థితి దిగ‌జారింది అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ప‌రిపాల‌న అనుభ‌వం, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప్ర‌ణాలిక‌లు, అవ‌గాహ‌నా రాహిత్యం వ‌ల్ల‌ అంతిమంగా రాష్ట్రం ఇబ్బందుల‌కు గుర‌వుతోంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.


ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి తెలంగాణ ఏర్ప‌డ్డాక‌, అప్ప‌టిదాకా పాలించిన నాయ‌కులు ముందుచూపు, ప్ర‌ణాళిక‌ల వ‌ల్ల మిగులు బ‌డ్జెట్ తో రాష్ట్రం ఏర్ప‌డింద‌ని, అంతేకాక అప్పుడు చేసిన అభివృద్ధి ఫ‌లాలు గ‌త ఐదేళ్లుగా చూస్తూ వ‌చ్చాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క వివ‌రించారు.

అస‌లు కేసీఆర్ పాల‌నా ఫ‌లితాలు ఇప్పుడు వ‌స్తున్నాయ‌ని.. వాటినే మ‌నం చూస్తున్నామ‌ని భ‌ట్టి వివ‌రించారు. స‌మ‌జంగా ఎక్క‌డైనా ఐదేళ్ల పాల‌న త‌రువాత ఫ‌లాలు వ‌స్తాయ‌ని.. ఇప్పుడు వ‌స్తున్న ప‌లితాలు కేసీఆర్ ఐదేళ్ల పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. కేసీఆర్ పాల‌న వ‌ల్ల తెలంగాణ రాష్ట్రం ఎంత ఆదాయం న‌ష్ట‌పోతుందో? ఈ బ‌డ్జెట్ ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు.

ఈ రాష్ట్ర అభివృద్ది, మిగులు బ‌డ్జెట్ అంతా గ‌తంలో వేసిన ప్ర‌ణాళిక‌లు, అభివృద్ధి ప‌నుల వ‌ల్లేన‌ని గ‌త ఐదేళ్లుగా చెబుతున్నామ‌ని.. అది ఇప్పుడు నిజ‌మ‌ని ఈ బ‌డ్జెట్ చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి కేపీఆర్ కు ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డం, స‌రైన ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌పోవ‌డంతోనే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయ‌బ‌డుతోంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.


ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌ల‌కు ఈ బ‌డ్జెట్ లో కేటాయింపులు ఏమైనా చేశారా.. అని భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌శ్నించారు. ఈ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్ర‌స్తావ‌న ఎక్క‌డా లేదు, అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించిన వివ‌రాలు ప్ర‌క‌టించ‌లేదు.
ఉద్యోగాల క‌ల్ప‌న‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌నా లేదు, ఇందిర‌మ్మ ఇండ్ల బిల్లుల వివ‌రాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా లేద‌ని భ‌ట్టి విక్ర‌మార్క మీడియాకు వివరించారు.


మంచి జ‌రిగితే.. అది మా గొప్ప‌త‌నం, రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురైతే ఇది ఇత‌రుల మీద‌కు నెట్టేయ‌డం ఈ ముఖ్య‌మంత్రికి అల‌వాట‌ని భ‌ట్టి విక్ర‌మార్క ఎద్దేవా చేశారు. కేంద్రం జీఎస్టీ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు అంద‌రికంటే ముందుగా దానిని అద్భుతం అని ప్ర‌క‌టించి, స‌భ‌లో దానిని అమోదించిన మొద‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని బ‌ట్టి గుర్తు చేశారు.

ఇప్పుడేమో కేంద్రం నుంచి రావాల్సిన రాబ‌డి రావ‌డం లేద‌ని, కేంద్ర ప్ర‌భుత్వ విధానం వ‌ల్లే న‌ష్ట‌పోతున్నామ‌ని మేఖ్య‌మంత్రి ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దం అని భ‌ట్టి అన్నారు. అప్పుడు అభివృద్ది బాగుండి డ‌బ్బులు వ‌స్తే నీ గొప్ప‌త‌నం, ఇప్పుడు రాక‌పోతే అది వేరే వాళ్ల త‌ప్పుకింద నెట్టేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని భ‌ట్టి ప్ర‌శ్నించారు.

శ్రీపాద ఎల్లంప‌ల్లి నుంచి హైద‌రాబాద్ కు తాగు నీళ్లు ఇచ్చేందుకు పైపు లైన్లు వేసి తీసుకువ‌స్తే.. హైద‌రాబాద్ కు వ‌చ్చిన పైపుల‌కు రంధ్రం చేసి నీళ్లు చూపించి.. మిష‌న్ భ‌గీర‌థ‌తో తెచ్చాం అని గొప్ప‌లు చెప్పుకున్నార‌ని భ‌ట్టి విమ‌ర్శించారు. అలాగే శ్రీపాద ఎల్లంప‌ల్లికి పైనున్న క‌డెం నుంచి నీళ్లు వ‌చ్చి నిండింద‌ని అన్నారు.

అలాగే ప్రాణ‌హిత‌-చెవేళ్ల ప్రాజెక్టులో అంత‌ర్భాగంగా ఉన్న 6, 7, 8 వ్యాకేజీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మొద‌లు పెట్టింద‌ని భ‌ట్టి గుర్తు చేశారు. క‌డెం, శ్రీపాద ఎల్లంప‌ల్లి, మిడ్ మానేరు, లోయ‌ర్ మానేరు ప్రాజెక్టుల‌న్నీ.. కాంగ్రెస్ క‌ట్టిన‌వేన‌ని.. వాటిలోకి నీళ్లు వ‌స్తే.. తానే క‌ట్టించి, కాళేశ్వ‌రం నీళ్ల‌కు
తెప్పించిన‌ట్లు చేస్తున్నార‌ని భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

వీటిలో ఏ ఒక్క‌దానికి మేడిగడ్డ‌తో సంబంధం లేక‌పోయినా.. కాళేశ్వ‌రం జ‌ల‌క‌ళ అని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని అన్నారు. అలాగే హైద‌రాబాద్ మెట్రోరైల్ కూడా కాంగ్రెస్ హ‌యాంలో నిర్మిస్తే.. దానిని మొత్తం తానే చేసిన‌ట్లు కేసీఆర్ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని భ‌ట్టి విక్ర‌మార్క విమ‌ర్శించారు.గ‌త నాలుగైదుళ్లుగా గ‌త ప్ర‌భుత్వాలు వేసిన ఆర్థిక పునాదుల‌పై
రాబ‌డులు వ‌స్తే.. అది త‌న గొప్ప‌త‌నంగా చెప్పుకోవ‌డం, రాబ‌డులు రాక‌పోతే.. ఆ నింద‌ను వేరేవాళ్ల‌మీద‌కు నెట్టేయ‌డం కేసీఆర్‌ చేస్తున్నార‌ని భ‌ట్టి అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం అవ‌లంబించిన ప‌ద్ద‌తుల ప‌లితాలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని అన్నారు.


ఈ బ‌డ్జెట్ ప్ర‌సంగం ద్వారా.. ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం త‌న వ‌ల్ల కాద‌ని కేసీఆర్ చేతులు ఎత్తేసిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు విమ‌ర్శించారు.దీనిపై మరింత చదవండి :