విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసింది : మంత్రి కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఈ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇది ఇరు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో పెను చర్చకు దారితీసింది. ఇపుడు కేంద్రం వెనకడుగు వేసింది.
ఇదే అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనుకడుగు వేసిందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను అడ్డుకుంటామని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఆయన పోరాటంతో ఇపుడు కేంద్రం వెనుకడుగు వేసిందని చెప్పారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరేనని ఆయన చెప్పారు.
తాము తెగించి పోరాడాం కనుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. కేసీఆర్ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై అధ్యయనం చేసేందుకు సింగరేణి నుంచి నిపుణుల బృందాన్ని పంపుతామని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్రం ఫగ్గన్ సింగ్ గురువారం ప్రకటించిన విషయం తెల్సిందే. కేంద్రం ఉన్నట్టుండి ఈ తరహా ప్రకటన చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.