శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (10:03 IST)

బైక్ నడిపేటపుడు నా కుమారుడు హెల్మెట్ ధరించి వుంటే..: కొడుకు శవం పక్కనే హెల్మెట్‌తో తండ్రి

జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో తన కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్‌ వినియోగంపై ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కదిలించింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన 18 ఏళ్ల తేజావత్ సాయి తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

 
అంతిమ యాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు. అంతటి బాధలోనూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడంపై యువతలో సందేశం పంపాలని నిశ్చయించుకున్నాడు. కుమారుడి శవం పక్కనే నిలబడి చేతిలో హెల్మెట్ పట్టుకున్న హరి, ఆ రోజు ఈ హెల్మెట్ ధరించి ఉంటే తన కొడుకు సాయి బతికి ఉండేవాడని రోదిస్తూ చెప్పాడు.

 
“నాలాగా ఏ బిడ్డను ఇలా కోల్పోకూడదు. బైక్ నడిపేటప్పుడు అందరూ హెల్మెట్ ధరించాలి”. కొడుకు మృతి చెందాడన్న బాధలో కూడా ఇలాంటి సందేశం చెప్పి, హెల్మెట్ ధరించాలని హరి చెప్పడాన్ని స్థానికులు కొనియాడారు. ఈ ఘటనను నెటిజన్లు విస్తృతంగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.