గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (19:58 IST)

80 యేళ్ల వయసులో పెళ్లికి సిద్ధపడిన తండ్రి .. కడతేర్చిన కన్నకొడుకు

మహారాష్ట్రలోని పూణే నగరంలో ఓ దారుణం జరిగింది. కాటికి కాళ్లు చాపిన 80 యేళ్ల వయస్సులో ఓ వృద్ధుడు మరో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ఈ విషయం తెలిసిన కన్న కొడుకు ఆగ్రహంతో తండ్రిని కడతేర్చాడు. ఈ దారుణం పూణే సమీపంలోని రాజ్‌గురునగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతంలోని నందదీప్ హౌసింగ్ సొసైటీలో నివసించి శంకర్ రంభు బొర్హాదే (80) అనే వృద్ధుడు పెళ్లి చేసుకునేందుకు వధువు కావాలంటూ ఓ మ్యారేజీ బ్యూరోలో ప్రకటన ఇచ్చి కొంత ఫీజు కూడా చెల్లించి తన పేరును నమోదు చేసుకున్నాడు. 
 
ఈ విషయం తెలియగానే ఆయన కుమారుడు శేఖర్ బోర్హదె (47)కు పట్టరాని కోపం వచ్చింది. ఆవేశంతో ఊగిపోయాడు. కాటికి కాళ్లు చాపిన వయసులో మరో పెళ్లికావాల్సి వచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నతండ్రిని హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.