శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 7 నవంబరు 2022 (09:41 IST)

మునుగోడు ఉప పోరులో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయి?

munugode bypoll vote count
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితం ఆదివారం వెల్లడైంది. ఈ ఫలితాల్లో అధికార తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీ ఒడ్డుకు చేరారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకుని ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం వెల్లడైన ఈ ఎన్నిక ఫలితంలో ఆయా పార్టీలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే, మొత్తం 15 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు సాగింది. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను ఇందులో లెక్కించారు. 
 
తొలుత పోస్టల్ బ్యాటెల్ ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి ఆధిక్యం సాధించగా, 2, 3 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ముందంజలో నిలిచారు. ఆ తర్వాత 14వ రౌండ్ వరకు తెరాస జోరు కొనసాగింది. చివరిదైన 15వ రౌండ్‌లో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ రౌండ్‌లో రాజగోపాల్ రెడ్డికి 1,358 ఓట్లు లభించగా, ప్రభాకర్ రెడ్డికి 1,270 ఓట్లు వచ్చాయి. 
 
12వ రౌండ్ల తర్వాత తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమైంది. అప్పటికే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ రాగా, కీలకంగా నిలిచిన గుట్టుప్పల మండలంలో తెరాసకు గంపగుత్తగా ఓట్లు పోలయ్యాయి. 
 
మొత్తంగా చూస్తే 15 రౌండ్ల అనంతరం తెరాసకు 97,006 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 86,697, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు లభించాయి. దీంతో కె.ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.