బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:24 IST)

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 36.73 శాతం మాత్రమే పోలింగ్‌

జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మండకొడిగా సాగింది. పోలింగ్‌ ముగిసే సమయానికి కేవలం 36.73 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 50 శాతం నమోదవ్వగా.. ఈసారి నమోదు శాతం భారీగా తగ్గింది.

కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఓట వేసే సాహసం చేయలేకపోవడం.. అధికార, ప్రతిపక్ష నాయకుల ప్రచారార్భాటాలు, ఒకరిపై ఒకరి తిట్ల దండకంపై ప్రజలు విసిగిపోవడం వంటి కారణాలతో ప్రజలు ఓటు వేసేందుకు మక్కువ చూపలేదని తెలుస్తోంది.

ఏది ఏమైనా ప్రజలను ఓటింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. కాగా, చెదురుమదురు ఘటనలు మినహా గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్‌ అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు పూర్తయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 150 డివిజన్లలో పోలింగ్‌ జరిగింది. ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొన్నిచోట్ల టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దిగారు.

మరి కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపణలతో బిజెపి, టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో హఫీస్‌పేట్‌, మాదాపూర్‌, ఆర్‌కేపురం, గచ్చిబౌలీ, జియాగూడాతోపాటు పలు ప్రాంతాలల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

నాచారం, ఉప్పల్‌ తదితర ప్రాంతాలల్లో కాంగ్రెస్‌, బిజెపి, టిఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దాంతో ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు వారిని చెదరగొట్టారు.

ఇదిలావుండగా కూకట్‌పల్లి ఫోరం మాల్‌ వద్ద మంత్రి పువ్వాడ కారు అద్దాలు పగుల గొట్టారు. కుషాయిగూడా, చర్లపల్లి, కాప్రాతదితర ప్రాంతాలల్లో పరిశ్రమల నిర్వాహకులు తమను ఓటు వేసేందుకు అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.