శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (07:16 IST)

హైదరాబాద్‌లో కుమ్మేసిన వర్షం.. నేడు రేపు ఉరుములు మెరుపులతో వర్షం

rain
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుంది. గురువారం రాత్రి కూడా మరోమారు భాగ్యనగరం బాగా తడిసి ముద్దయింది. గత రాత్రి వర్షం కుమ్మేసింది. అలాగే, శుక్ర, శనివారాల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రాత్రి హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గత రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం తుడిసి ముద్దయింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఎప్పటిలాగే ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక నాగర్ కర్నూలు, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, కుమురం భీం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది.
 
అదేసమయంలో వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో ఎల్లుండి, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది 
 
8వ తేదీన వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని, అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ బలపడే అవకాశం ఉందని వివరించింది. అది అల్పపీడనంగా మారిన తర్వాతే దాని తీవ్రత, ప్రయాణించే మార్గం తెలుస్తుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.