ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (08:19 IST)

అనుమానపు మొగుడితో వేగలేను.. చంపేయండి... భర్త హత్యకు భార్య సుపారీ!

నిత్యం అనుమానిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చిమరీ చంపేసింది. ఈ హత్యలో ఆమె బంధువులు కూడా పాలుపంచుకోవడం గమనార్హం. తన బంధువులతో కలిసి భర్తను చంపేసిన భార్య.. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేశంపెట మండలం అల్వాల్‌లో గత నెల 30వ తేదీన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అల్వాల్ గ్రామ పరిధిలోని ఎర్రగడ్డతండాకు చెందిన పాత్లావత్‌ చంద్రునాయక్‌ (45)కు ఐదుగురు భార్యలు. గ్రామానికి చెందిన యాదమ్మ హత్య కేసులో అతను ఏడేండ్ల శిక్ష అనుభవించి రెండేండ్ల క్రితం విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మూడో భార్య అనితతో ఉంటున్నాడు. 
 
'నేను జైలులో ఉన్నప్పుడు ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. నిన్ను కూడా చంపేస్తా' అని చంద్రు నిత్యం భార్యను బెదిరించేవాడు. భర్త వేధింపులు భరించలేక అనిత బాలానగర్‌ మండలం రంగారెడ్డిగూడలో ఉంటున్న తన అక్క కొడుకు పాత్లావత్‌ మోహన్‌కు తన గోడును వెళ్లబోసుకున్నది. 
 
చంద్రును అడ్డుతొలిగిస్తే ఏమిస్తావని మోహన్‌ అడుగగా.. భర్త నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి 2.20 ఎకరాల్లో ఎకరం పది గుంటలు ఇస్తానని హామీ ఇచ్చింది. రూ.10 వేలు మోహన్‌ చేతిలోపెట్టింది. పథకం ప్రకారం.. డిసెంబర్‌ 30న చంద్రుకు మోహన్‌ ఫోన్‌చేసి వేములనర్వకు పిలిచాడు. అక్కడ ఏదో మాట్లాడినట్టు నటించి వెనక్కి పంపించారు. 
 
అనంతరం అనిత, మోహన్‌, సబావట్‌ బాలు, పాత్లావత్‌ వేణు, సబావట్‌ మోతిలాల్‌ కలిసి వేములనర్వ నుంచి అల్వాలకు వెళ్లే దారిలో చంద్రును రాడ్డుతో తలపై కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. చంద్రు హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రమాద ఘటనపై మృతుడి తండ్రి భద్రుకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను విచారించగా హత్య బయటపడింది.