వ్యాక్సినేషన్‌లో తెలంగాణా రికార్డు... కోటి టీకాలు క్రాస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కరోనా టీకాల వ్యాక్సినేషన్‌లో కోటి మార్కును దాటింది. జనవరి 16న ప్రారంభమైన టీకా డ్రైవ్ శుక్రవారం సాయంత్రంతో 1,00,53,358 వ్యాక్సిన్ డోసులకు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
మొత్తం 33 జిల్లాల్లో మొదటి, రెండో డోసులను కలుపుకుని ఈ మార్క్‌ను అందుకున్నట్లు తెలిపారు. 1,00,53,358 వ్యాక్సిన్ డోసుల్లో 86,06,292 మందికి మొదటి డోసు లభించగా, మిగిలిన 14,47,066 మందికి రెండు వ్యాక్సిన్లు లభించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో కోటి కరోనా డోసుల పంపిణీ సందర్భంగా నగరంలోని కోఠి డీహెచ్ కార్యాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు, ఆరోగ్య కార్యదర్శి ఎస్.ఎ.ఎమ్. రిజ్విని సీఎస్ అభినందించారు.
ఈ సందర్భంగా డీహెచ్ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడిలో తెలంగాణలో ముందుందన్నారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది టీకాకు అర్హులుగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన లబ్ధిదారులకు అందించడానికి తామంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
హై రిస్క్ ఉన్న గ్రూపులను ప్రాదామ్యంగా తీసుకుని వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ (22,30,655), మేడ్చల్-మల్కాజ్‌గిరి (11,86,140), రంగారెడ్డి (12,78,287) గరిష్టంగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పొందిన జిల్లాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.