తెలంగాణలో కరోనా విజృంభణ.. 337మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 37,079 కరోనా టెస్టులు నిర్వహించగా 337 మందికి కరోనా సోకినట్టు బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇందులో 2,98,826 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 2,958 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక కరోనాతో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1671కి చేరింది. ముఖ్యంగా పాఠశాలలపై కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.
గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు కొవిడ్ మహమ్మారి బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలు విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య .. వెళితే కరోనా భయం..ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.