మరో బాదుడుకి సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చార్జీల బాదుడు పేరుతో ప్రయాణికుల నడ్డి విరిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఈ చార్జీలను పెంచేసింది. ఇపుడు మరోమారు బాదుడుకు రంగం సిద్ధం చేసింది. లగేజీ చార్జీల రూపంలో మోత మోగిచనుంది. ప్రస్తుతాని 50 కేజీల లగేజీ వరకు ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు వుంది. ఆ తర్వాత అదనపు లగేజీ పేరుతో మరింత భారం మోగనుంది.
అదనంగా ఒక కిలో పెరిగినా.. పాతిక కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి.. పూర్తి చార్జీని వసూలు చేస్తారు. పెయిడ్ లగేజీలో 25 కిలోలు దాటితే మరో యూనిట్‌గా చార్జీ వసూలు చేస్తారు. అంటే.. ప్రతి యూనిట్‌కు ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ.1 వసూలు చేసేవారు. ఈ నెల 22 నుంచి ఆ చార్జీని రూ.20కి పెంచనున్నారు. అంటే ఒకేసారి ఏకంగా రూ.19 పెంచనున్నారు.
అలాగే, అదే 26-50 కి.మీ మధ్య లగేజీ చార్జి ప్రతి యూనిట్‌కు ఇంతకుముందు రూ.2గా ఉండగా.. రూ.40కి సవరించారు. 51-75 కి.మీ. మధ్య రూ.3కు గాను రూ.60గా.. 76-100 కి.మీ మధ్య రూ.4కు గాను రూ.70గా చార్జీలను సవరించారు. ఇలా కిలోమీటర్ల వారీగా లగేజీ చార్జీల మోతమోగింది.
డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2002లో లగేజీ చార్జీలను సవరించారని.. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడే సవరణ జరిగిందని వివరించారు.