తెలంగాణలో 2వేలకు చేరిన కరోనా కేసులు.. దేశంలోనూ విలయతాండవం
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వేయిలోపే నమోదవుతున్న కేసులు ఇవాళ 2వేలకు చేరువలో నమోదయ్యాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1914 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649కి చేరింది.
ఇందులో 3,03,298 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,617 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1734కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం మంగళవారం 285 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
అలాగే భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 12,08,329 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,15,736 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.28కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 630 మంది ప్రాణాలు కోల్పోయారు.