కరోనా టీకా కోసం వెళితే ర్యాబిస్ వ్యాక్సిన్ వేశారు...
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అపుడపుడూ తప్పులు జరుగుతున్నాయి. ఇటీవల ఐదు నిమిషాల వ్యవధిలో రెండు డోసుల కరోనా టీకా వేశారు. మరోచోట.. కరోనా టీకాకు బదులు మరో ఇంజెక్షన్ వేశారు. ఇపుడు కరోనా టీకా కోసం వెళితే ర్యాబిస్ సూది వేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్లగొండ జిల్లాలో కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకుని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్‌సీకి వెళ్లారు.
పీహెచ్‌సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్‌సీకి వెళ్లారు. అదేసమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటి రేబిస్ వ్యాక్సిన్‌ను వేసిందని.. కొవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకూ అదే సిరంజీతో యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె ఆరోపించారు.
ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా 'బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌లోకి కాకుండా, యాంటిరేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు. టీటీ ఇంజక్షన్ ఇచ్చాం. దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదు' అని తెలిపారు.