పాలమూరులో అడుగుపెట్టే నైతిక హక్కు ప్రధాని మోడీకి లేదు : మంత్రి కేటీఆర్
పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ అడుగుపెట్టే నైతిక హక్కు లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాలమూరు వేదికగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టనుంది. దీనిపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సభ ద్వారా బీజేపీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండగా... పాలమూరులో అడుగుపెట్టే నైతిక హక్కు మోదీకి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
పాలమూరు అంటేనే అంటేనే వలసల జిల్లా అని, దేశంలో ఏ నిర్మాణం జరుగుతున్నా అక్కడ పాలమూరు కూలీలు కనిపిస్తారని ఓ నానుడి ఉందని వివరించారు. భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లాకు నరేంద్ర మోడీ ఏంచేశారని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు, సభ జరపాలని పాలమూరును ఎందుకు ఎంచుకున్నారో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.
'పాలమూరు జిల్లాకు ఏం చేశారు మీరు? 2014 జూన్ 2న తెలంగాణ వస్తే జులై 14న మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓ లేఖ తీసుకుని మీ వద్దకు వచ్చారు. నీటి అంశంలో జరిగిన అన్యాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓ ప్రాతిపదికగా ఉంది... మహబూబ్ నగర్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా... గోదావరి, కృష్ణా జలాల్లో వాటా తేల్చాలి... మీరు ట్రైబ్యునల్కు సిఫారసు చేస్తే చాలు... మాకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కుతుంది అని మా ముఖ్యమంత్రి మీకు వివరించారు.
ఇది జరిగి తొమ్మిదన్నరేళ్లు అవుతోంది. పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం తెలంగాణలో మేజర్ ప్రాజెక్టులు. ఒకటి కృష్ణా నదిపై, మరొకటి గోదావరి నదిపై ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని ప్రధానిని కోరగా, ఇప్పటి వరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని ఆయన చెప్పారు.