బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (10:30 IST)

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చిన్నారులకు ఉచిత ప్రయాణం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి, లాభాల బాటలోకి తెచ్చేందుకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అనేక రకాల ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటిస్తూ వాటిని అమలు చేస్తున్నారు. తాజాగా 12 యేళ్లలోపు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అయితే, ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కేవలం ఒక్క రోజు మాత్రమే. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇపుడు కసరత్తులు చేస్తున్నారు.
 
శనివారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్ భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ, పండగ రద్దీని తగ్గించేందుకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీల వసూలుకు స్వస్తి పలికినట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా ఆర్టీసీ ఎంతో పురోగతిని సాధించిందన్నారు. సంస్థలోని కార్మికులంతా ఇలానే పని చేస్తూ సంస్థకు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, ఎంబీబీఎస్ స్టేషన్ ప్రధాన ద్వారం నుంచి ఫ్లాట్‌పామ్‌లకు చేరుకునేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడుతుండటంతో వారి కోసం ప్రత్యేకంగా ఉచిత బగ్గీని ఏర్పాటుచేశారు. బ్యాటరీతో నడిచే ఈ బగ్గీని సజ్జనార్ శనివారం ప్రారంభించారు.